Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ను బతితతూణబాణాసనులును రక్తధారధౌతధూళిధూసరితాంగులును నాగ
పాశబద్ధులును విచేష్టితులు నై యున్నయన్నరేంద్రనందనులం జూపినం జూచి
నిమీలితలోచన యగుచు.

577


సీ.

ఉల్లంబు జల్లన నొదవుతల్లడమున, నొకమూర్ఛ గవిసిన నొయ్యఁ దెలిసి
నివ్వెఱపడి తెంపు [1]నిశ్చయమున సాధ్వి, తలయూఁచి దైవంబు తగవు మెచ్చి
చిత్తంబు నాటినచెయ్వులు దలపోసి, కనుఁగొనలను నశ్రుకణము లొలుక
నొగి దృష్టి కాసయు నోటయుఁ బాటిలఁ, బరిణతస్నేహానుబంధ మొందఁ
దెగువ మోమునఁ జేట్పాటు మిగుల మఱియుఁ, జూచి పాణిపంకజమును శోకశుష్క
కంఠనాళాంతరమున గద్గదిక నెగులు, కొనునెలుంగును నెత్తి యజ్జనకతనయ.

578

నాగపాశబద్ధు లగురాఘవులం జూచి వగచు సీతను ద్రిజట యూఱడించుట

ఉ.

ఓరఘునాథ పుణ్యచరికతోజ్జ్వల చాపకళాకలాపశి
క్షారమణీయ దివ్యశరజాలపరిశ్రమశస్తహస్త నీ
వీరణశయ్యఁ గన్మొగుచు టేర్పడఁ జూచియు నున్నదాన నా
కూరిమి సూచి తిట్లు నృపకుంజర దీనికి నన్ను నే మనన్.

579


ఉ.

వల్లభుపేర ని ట్లయినవార్త సెవిం బడునంతలోన బి
ట్టుల్లము వ్రయ్య లై యెడల నుండక ప్రాణము లేఁగెనేని భూ
వల్లభ కూర్మిగాక విధవాత్వము సైఁపఁగలేక చిచ్చులోఁ
[2]ద్రెళ్లుటయే యటే తగవు దీర్పక తక్కుదురే కులాంగనల్.

580


ఉ.

అక్కట పత్నికోర్కికొఱకై వనభూమికిఁ బుత్రుఁ బుచ్చితిం
దెక్కలిసత్య మింతటికిఁ దెచ్చెఁ గదే నను నంచుఁ దండ్రి నీ
దిక్కున మక్కువం దనదుదేహము దక్కెను గాక తాల్మిమైఁ
జిక్కను రాతిడెంద మగు సీతయటే యిఁకఁ జెప్ప నేటికిన్.

581


వ.

అని శోకించి సౌమిత్రిం గనుంగొని.

582


శా.

అన్నా లక్ష్మణ భ్రాతృవత్సల దురంతాయాసఖిన్నుండ వ
య్యు న్నిద్రారహితుండ వై యకట ము న్నుగ్రాటవీభూములం
దన్నం గొల్తు గదన్న నేఁడు రణశయ్యన్ భూవిభుం డుండఁగాఁ
గన్నాఁగం దగునయ్య నీనిదురకుం గాలం బయోధ్యం గదా.

583


చ.

అనుచు విషాద మంది హృదయం బగలం బతిదిక్కు గ్రమ్మఱం
గనుఁగొని నాకునై కడలిఁ గట్టితి నాథ మహాత్మ నిగ్రహం
బనుచిత మెందు నుత్తములు కట్టిది గా దయినం బ్లవంగవా
హినులు గలంగఁ గట్టుపడితే రిపుచే గుణరత్నసాగరా.

584
  1. నిశ్చయముగ నిల్చి తలయూఁచి
  2. ద్రెళ్లుదురే యటే - ద్రెళ్లుటయే యెడం - దగవు