పుట:భాస్కరరామాయణము.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాముఁడు హనుమంతునిచేత ముద్రిక యిచ్చుట

ఉ.

ఈహనుమంతునందుఁ గల వెక్కుడుశక్తియు విక్రమంబు ను
త్సాహము [1]దేశకాలవిహితక్రమయుక్తియు సాహసంబు న
ర్థాహితనీతి యున్నతియు నాతతతేజము వేగ మేఁగి వై
దేహిఁ గనంగ నోపుటయు ధీరతయుం గృత కార్యసిద్ధియున్.

566


క.

ఇనసుత యీతనివలనం, దనర మదీయాభిమతము ధన్యత నొందున్
విను మని పావనిఁ గనుఁగొని, మనుజేశ్వరుఁ డిట్టు లనియె మన్ననతోడన్.

567


క.

జానకి వెదకఁగఁ జని కని, యానందముతోడ వచ్చి యాదట రఘుసం
తానము నాప్రాణంబులు, మానుగఁ గలుగంగఁజేయు మారుతపుత్రా.

568


క.

మానుగ నీముద్రిక గని, మానసమున సంతసించి మారుతసుత నిన్
నే నటఁ బుత్తెంచితి నని, జానకి సత్కృతులు నీకు సమ్మతి జేయున్.

569


క.

అని నిజనామాంకితకాం, చనమణిగణకమ్రకిరణసదమలశోభా
కనదంగుళీయకము న, త్యనురక్తిం జేతి కిచ్చె ననిలజుఁ డంతన్.

570


క.

శిరమున ముద్రికఁ దాలిచి, నరపతిపదములకు మ్రొక్కి నలువుగ గంతుల్
పొరిఁబొరి వైచుచు పావని, తరుచరసైనికులనడుమఁ దద్దయు వెలసెన్

571


క.

[2]ఇనజుఁడు దక్షిణదిశ కి, ట్లనిలజముఖకీశవరుల నవనిజ వెదకం
జనఁ బనిచి వెనుక సమ్మతిఁ, దనమామ సుషేణుఁ జూచి తా ని ట్లనియెన్.

572

సుగ్రీవుఁడు సుషేణునిఁ బశ్చిమదిక్కునకుఁ బుచ్చుట

వ.

కపివర నీవు రెండులక్షలవానరవీరులతోడఁ బశ్చిమదిగ్భాగంబునకు నేఁగు తదీ
యమార్గంబు నెఱుంగఁ జెప్పెద వినుము సౌరాష్ట్రసౌహిత్యబాహ్లికశూద్రాభీర
జనపదంబుల వకుళాధివాసితంబు లయినపున్నాగగహనంబులఁ గేతకీషండంబుల
నారికేళవనంబుల విహరించి యధికప్రవాహనదులఁ దాపసారణ్యంబుల నెమకి కేక
యసౌవీరత్రిగర్తదేశంబుల మహాగ్రాహసంకులం బైనపశ్చిమసముద్రద్వీపంబు
ల వైదేహి వెదకి చైత్రపాదపశోభితం బైనమరీచిపట్టణంబున సరస్సాగర శైలవ
నస్థలంబుల మఱియునుం గలపురాణవనంబుల రత్నశోభితపట్టణంబుల సింధు
సాగరసంగమంబుల వైదేహి వెదకుచు శతశృంగంబులు గలమహాహేమగిరి
చేరి తోయదస్వనమత్తమాతంగంబుల దృప్తసింహంబుల నీడవాసు లైనబలవ
త్పక్షిగణంబులఁ గని యగ్గిరిసానుతటంబుల వెదకుచు నచట నున్నవిస్తీర్ణకమ
లాకరంబులఁ దీర్థంబులఁ దాపసారణ్యంబుల గిరిస్థలంబుల వనోపవనంబుల సీత
వెదకుచు మఱియు గజవనంబులఁ బంచనదశోభితం బైన కాశ్మీరమండలంబున
దక్షిణశిలానగరంబున గౌళకేకయాదిదేశంబులఁ బట్టణంబుల సాగరద్వీపంబుల

  1. దేశకాలహితసంక్రమవృత్తియు
  2. ఇనజుం డతిబలవేగుల, హనుమంతప్రముఖకపుల నవనీతనయం
    జని వెదకఁ బనిచి సమ్మతిఁ