పుట:భాస్కరరామాయణము.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

మును రామవిభునియానతి, చనఁ జేసినయంతమీఁద సత్కృతులను జే
కొనియెద విను నీతోడను, జననాథుం డాడు మనిన సముచితభాషల్.

469


క.

కులబలలలితుఁడు సూనృత, కలితుండు జితేంద్రియుండుఁ గరుణాన్వితుఁడు
విలసితధర్ముఁడు నగురా, జిలలో నతిపూజ్యుఁ డగుచు నేపారు సిరిన్.

470


క.

ఉపకారి యైనమిత్రున, కుపకృతి సేయం బ్రతిజ్ఞ యొనరించి మృషా
లపితుండై యుండెడునా, కపటాత్ముం డధికహింసకతముం డరయన్.

471


సీ.

పశువాంఛ బొంకినఁ బంచపశుఘ్నుఁడౌ, గోనృతాత్ముఁడు దశగోప్రహర్త
యశ్వానృతుండు శరతాశ్వహింసకదోషి, [1]పురుషానృతసహస్రపురుషహరుఁడు
వసుధకై బొంకినవాఁడు సర్వధ్వంసి, కనకంబుకొఱకు బొంకినఖలుండు
సకలజాతాజాతజనులఁ ద్రుంచినవాఁడు, తనపల్కు మిథ్య చేసినయతండు
దన్ను నాప్తజనులఁ దా వధించిన పాపి, భువిఁ గృతఘ్నుఁ డఖలభూతఘాతి
యని కృతఘ్నుఁగూర్చి యఖిలలోకేశుండు, పరఁగఁ బల్కినట్టిపలుకు వినుము.

472


క.

మతిఁ దలఁప వచోభగ్న, వ్రతునకును సురాపునకు నిరంతరమును ని
ష్కృతి గలదు గాని తగ ని, ష్కృతి లేదు కృతఘ్నబుద్ధికిని విబుధోక్తిన్.

473


క.

ఉపకృతుఁ డై యుపకారికి నుపకారం బిచ్చఁ జేయకుండుకృతఘ్నుం
డపగతుఁ డైనను దద్దా, త్రపరీతామిషముఁ దినవు క్రవ్యాదములున్.

474


చ.

నృపతికిఁ దోడువత్తు ధరణీసుత నారయఁ బుత్తు నంచు ని
క్కపుగతి [2]ఋశ్యమూకమునఁ గందువ సేయవె యగ్నిసాక్షిగా
శపథము చేసి తిప్పి యిటు సంతతదారరతానుభూతి మో
హపడుచు నున్నవాఁడవు నృపాగ్రణిమేలు దలంప వేమియున్.

475


క.

రామునిచే రాజ్యముఁ గొని, ప్రేమం గామినులతోడఁ గ్రీడించెద వా
రామునితెరువు దలంపవు, కామాంధుడు గనునె యర్హకార్యము చేయన్.

476


క.

మును నీ వాడినమిథ్యా, సునయోక్తుల రాముఁ డలరె శుభతరచిత్తం
బున నారసి మండూక, స్వనఫణి వగు టెఱుఁగఁ డకట జనపతి నిన్నున్.

477


మదవృత్తిం గడు వాలి వాలి దనకున్ మా ఱెందు లే దంచు ను
న్మదుఁ డై యుండఁగ నీకుఁ బూని చని రామక్ష్మావిభుం డుగ్రుఁడై
కదనోద్దండత నొక్కయమ్మునన వ్రక్కల్ సేసె నవ్వాలిఁ ద
త్ప్రదరం బిప్పుడు మొక్కవోదు నినుఁ ద్రుంపం జాలుఁ క్రొవ్వాఁడిమిన్.

478


శా.

ఉద్యజ్జ్యాలత ఘోరఘోషముల వజ్రోగ్రధ్వనిన్ మ్రోయఁగా
విద్యుత్సంఘముభంగి వ్రాలెడుసమిద్వీరాహితత్రాససం
పాద్యన్మత్పటుదోర్వికృష్టఘనచాపం బాజిలోఁ జూడఁగా
నుద్యోగింపు యమాలయంబు చొర నీ కుత్సాహ మేపారినన్.

479
  1. పురుషావృతుఁడు సహస్రపురుషహరుఁడు
  2. ఋశ్యమూకమున కందువఁ జేయిడి యగ్ని