బసవరాజు అప్పారావు గీతములు/మాయమైపోతె
మది గల తమిమంటలార
వదలని బిగికౌగిట ని
న్నెద నెద గదియించెడు సం
పదకు పెట్టి పుట్టనైతి !
సొగసు గుల్కు నీదు ముద్దు
మొగము గాంచి మది వేచెడు
వగపు మరచి వలపుకలిమి
నగుటుండునె యీ జన్మకు ?
కలలోనైనను కనుపడి
చెలియా, యీ దీనుని మది
యలజడి యంతయు బోవన్
కలసి వలపు దీర్చలేవె ?
మాయమైపోతె
మగువరో యింతలో మాయమైపోతే
మాటాడకుండనే మాయమైపోతే,
మల్లెపూజాడలనె మాయమైనావె,
మనుగొట్టి కనులలో మాయమైపోతే ?
మండు వేసవిటెండ పండువెన్నెలయట్లు
భావించి నీకునై పరుగెత్తి వచ్చితినె
మగువరో! యింతలో మాయమైపోతే ?
నోరార దాహమున కోరికల నువ్విళ్ళ
నూరి ప్రాణము నిల్పి పారి వచ్చితినే
మగువరో! యింతలో మాయమైపోతే ?
వడదాక నెమ్మేను వడిపోయి తరువట్లు
కడగండ్లు దీర్తు వని వడిలేచి వచ్చితినె
మగువరో! యింతలో మాయమైపోతే ?
ఇంత మోసము జేయ నింతి నీ కేలనే
భ్రాంతి గొన్నందులకు వంతగూర్చితివే
మగువరో యింతలో మాయమైపోతే ?